10 అక్టోబర్, 2017

గోవధ గురించి విశ్వనాధ వారి మాటలలలో



వేయిపడగలు పుస్తకంలోని కథానాయకుడి పేరు ధర్మారావు.. అతను తన గ్రామంలో ఒకనాడు తిరుగుతూ ఉండగా అతనికి చిక్కి శల్యమైన ఒక ముసలిఎద్దు కనపడుతుంది... అతను దాని పరిస్థితిని చూసి విచారిస్తూ ఉండగా ఆ సందర్భములో విశ్వనాధ సత్యనారాయణ గారు నాగరికత పేరిట పశుసంతతిని నిర్లక్ష్యం చేస్తున్న విధానము గురించి,, గోవధ గురించి ఈ విధంగా వాఖ్యానింపచేశారు ఆ పాత్ర చేత

"" ఇరువది యేళ్ళ క్రిందనున్న ఆబోతులకు దీనికి ధర్మారావునకు తారతమ్యము తోచెను. ఒకప్పుడు ఆబోతును అదిలించినవారు లేరు. కర్రతో కొట్టిన వారు లేరు. తన చిన్నతనములో ఒక ఆబోతు వచ్చి తెరచియున్న బస్తాలోని ధాన్యము తినుచుండెను . ఎవరు నేమియు అనలేదు. కొన్ని తిని ఆబోతు వెడలి పోవుచుండెను. తన తండ్రి కడవతో నీరు తెచ్చి ఆ బోతునకు పెట్టెను. ఆ ఆబోతునకు అక్కర్లేదన్నట్టు తొలగిపోయెను. పక్కనున్న యొక కాపు ' బాబుకి దాహం అగుట లేదు కాబోలు పోనీండని ' అనెను.

ఆ ఆబోతు విశాలమైన ఫాలభాగము, నేత్రములందు రాజాధిరాజులను పోలిన ఠీవీ,, సుందర మంధర యానము, కైలాసగిరి మీది యధేచ్ఛా విహారి. గిర్యుపత్యకల నుత్ఖాత క్రీడ వలన కొమ్ములు తగులుకొన్న రాజతచ్ఛవివోని, కొమ్ముల కాంతితో త్రిలోకాధిపతి వలె సంచరించుచుఉండెను.


బీళ్ళన్నియూ మాగానులు కాలేదు. వృషభరాజు పొలాల మీదకే పోలేదు. కాపు ఆవులను సంతలకు తోడుకొనిపోయి , మంచి కోవగల యాలను, దూడలను పరదేశములకి ఎగుమతి చేయుచుండిరి.. ఒంగోలు వృషభములు, పలనాటి ఎద్దులు సర్వమును సంతనపడి ఇతర దేశములకు పోయెను. దేశములో కోవగల దూడలేదు, ఆవు లేదు. 


జమిందారులు బీళ్ళన్నియూ మాగానులు చేసుకొనుచుండిరి. మాగాని చేయుట కమ్ముచుండిరి. మాగాని తృష్ణ ఎక్కువైపోయెను. పశువు నిలుచుటకు తావులేదు. క్రమముగా పొలాలు యంత్రములతో దున్నుకొందురు.. యంత్రములతో కోసికొందురు.


పశువెందుకు? క్షీరములు కావలయునా? ఆస్ట్రేలియా నుండి రానే వచ్చుచుచుండెను కదా !! ఇంగ్లీషావులను దిగుమతి చేసుకొందుము. అవి మన ఆవుల వలె కాదు.. ఒక్కొక్కటి పదిశేర్లిచ్చును. ఆ పాలకు వెల కూడా ఎక్కువ.

ఆబోతును ధర్మారావు పరిశీలించి చూచెను. దాని యొడలెల్లా కర్ర దెబ్బలు తేలియుండెను.. ధర్మారావునకు దుఖఃము వచ్చెను..


ఆహా !! ఒకనాడీ వృషభరాజు మా దేశమున దైవాధిదైవము . మహా శిల్పులు ఇతని కొమ్ములు, నడక తీరు, పండుకొనిన వైభవము వైభవము, దివారాత్రములు చూచి చూచి నందీశ్వరులను చెక్కుకొనిరి. ఇతడు దేవాలయములందు సమారాధనీయుడయ్యెను. ఇతడు వీధులలో నిలుచుండి పిల్లవాండ్ర చేత గంగడోలు గోకించుకొనెను. ఇతడు వీధులలో నిలుచుండగా బాలురతనితో ఆడుకొనిరి. ఇతని నడుము కింద నుండి దూరిపోయిరి. ఇతని వర్షణశీలమైన అవయవ స్పర్శ చేత గిలగిల నవ్వుకొనిరి. అతడును వారిని తన్నలేదు. పొడవలేదు..


ఆనాడు దేశములో ఇతడొక ఎత్తు , తక్కిన సర్వసృష్టి మరొక ఎత్తు. నాటి సంకులమైన 'కుంద శంఖ చంద్రహార నీహార డిండీర పటీర ముక్తాహార హీర సంకాశములను, కాదంబ కాలేయ కాదంబినీ నీలజాల తమాలికా సన్నిభములును, ప్రౌఢ బంధూక పల్లవ సదృశములును, వికచకాంచన చంపక విస్పుటములైన వర్ణములొప్పనేత్రాభిరామ భంగి నలరారు గో కదంబములు ' లేవు. అవి సంచరించు వనములు లేవు.


గోవు అన్నది నశించిపోయింది. ఆబోతున్నది అదృశ్యమైపోయినది. ' గోబ్రాహ్మణేభ్య శుభమస్తు ' అన్న దేశములో , 'తేభ్యో శుభమ ' స్తన్న దుర్వాక్కే సర్వత్రా విజృంభించెను.. 


బ్రాహ్మణునకు గోవునకు దేశము బ్రతకరానిదయ్యెను. ఇంకను బ్రాహ్మణుడే నయము. ఇంటిలో నుండి త్రోసివేయగా వాసములయినను పట్టుకుని వ్రేళ్ళాడుతూ ఉన్నాడు. ' నాది కర్మభూమి. ఈ భూమిలో నుండి కర్మ పోదన్న ' పంటి బిగువ వానికి వదలలేదు. 


గోవు నోరులేని జంతువు. అది సభలు చేయలేదు. ' నా జాతి చచ్చిపోవుచున్నదో ' అని మొర పెట్టలేదు. పాపము నిమ్న జాతుల లోనను చేర్చుకొనలేదు. దానికి ఓటు లేదు. శాసనసభలకు తన ప్రతినిధులను ఏమి పంపించుకొనగలదు ! వలసపోయిన వారు, తాము పోయినచోటి జాతులను కూకటి వేళ్లతో కుద్దాలించినట్లు తనను కూడా ఎవరో కుద్దాలించిరి. తనకు పొలమునకు వలసవచ్చినది ఎవరు? ఎవరో కనిపించలేదు


ధర్మారావు ఆబోతు వంక మరలా చూచెను.ఆ అపర శివాకృతి ముఖము మీద నెత్తురు కనిపించెను. ఎవరో కర్రపెట్టి కొమ్ముల నడుమ మోపైన దెబ్బకొట్టెను. 


ధర్మారావు మరలా విచారించ ఆరంభించెను..


" గో రాజా ! నీ నెత్తురు కన్నుల చూచితిమి. ఆల పొదుగులు కోసుకొని త్రావితిమి. ఆవుల మాంసము సోల్జరులకు వండిపెట్టితిమి. మా జమిందారులును,మేమును పరమ నాస్తికులమైపోతిమి.


సర్వజంతు సంతానము నందు, వృక్షములందు ,పచ్చిగడ్డియందు ప్రాణం ఉన్నదన్న మా ఋషుల సిద్ధాంతములు నేడు పరాస్తమైనవి. పదార్థ విజ్ఞానశాస్త్రజ్ఞులు రుజువుచేసి చూపించినగాని మేము నమ్మము. మా ఆస్తిక భావములు మంగలములలో పెట్టి మలమల వేయించబడెను.


మా మతం దేవుడున్నాడని కాదు. ఆ దేవుడు ఉండనిమ్ము. చావనిమ్ము. సర్వమైన సృష్టియందును ప్రాణము, జీవము, ఆత్మ కలకలలాడుచున్నదని మా పూర్వ ఋషులు చూచిరి. సర్వ వస్తుగత ప్రాణమును సమారాధించిరి. అంతకన్నా భూతదయ లేదు. మా పూర్వులు గోవధ చేయలేదు. గోవులలో ప్రాణము పరమాత్మకు సన్నిహితమైయున్నది. గోక్షీరము నందు ప్రాణము నిబిడీకృతమై ఉన్నది. అంత ప్రాణశక్తి మరియొక దానియందు లేదు. 


నశించిపోతిమి. గడ్డి కరిచితిమి. మృతుల మైతిమి. "" అని...


ప్రస్తుత పరిస్థితులలో తీవ్రంగా దృష్టి సారించాల్సిన అంశము కదా ఇవి?


- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి